Current Date: 22 Mar, 2025

పులిని కాల్చి చంపిన అధికారులు.. ఆ కారణంతో తప్పలేదట

జనావాసాల్లోకి వచ్చినా సరే సాధారణంగా పులిని చంపితే కేసు అవుతుంది. అది జనమైనా.. అధికారులైనా కేసే. కానీ.. కేరళలో తప్పనిసరి పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులే పులిని కాల్చి చంపాల్సి వచ్చింది. ఒకవేళ ఆ పులిని చంపకపోతే.. తాము చనిపోయేవాళ్లని అధికారులు వాదిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్‌ గ్రామంలోకి అటవీ ప్రాంతం నుంచి పులి వచ్చి అక్కడ కొన్ని పశువులను చంపింది. ఈ నేపథ్యంలోనే దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది.. దానికి మత్తుమందు ఇవ్వడానికి 15 మీటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు.కానీ.. కాల్పుల శబ్ధం విన్న పులి.. ఒక్కసారిగా వారిపై దూకి దాడి చేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం సిబ్బంది వెంటనే మళ్లీ కాల్పులు జరపడంతో పులి మృతి చెందినట్లు అటవీశాఖ సీనియర్‌ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పులి వయసు పదేళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Share