ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, కుటుంబ సభ్యులు చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్ళారు. చంద్రబాబు నుదుటున నామం.. సంప్రదాయ వస్త్ర ధారణతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని గేట్లను మూసి వేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకీ భక్తులను ఎవర్ని అనుమతించలేదు. రెండు రోజులపాటు చంద్రబాబు తిరుమలలో పర్యటించనున్నారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులతో తిరుమల క్షేత్ర అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. కాగా తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
Share