Current Date: 21 Mar, 2025

ఇక డైరెక్టుగా విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

ఏఐ ఆధారిత మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను జూన్‌ 30 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని, దీని ద్వారా వాయిస్‌ సేవలు అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. టెన్త్, ఇంటర్‌ విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్‌ ద్వారా హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చిన కూటమి సర్కార్.. పబ్లిక్‌ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే.. వాటి ఫలితాలను కూడా వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు. అలాగే ఏఐ ఆధారిత వాయిస్‌ సేవలతో.. బస్‌ టికెట్‌ కావాలని నోటితో చెబితే టికెట్‌ బుక్‌ చేస్తుందని, నంబర్‌ చెబితే కరంటు బిల్లు కట్టేస్తుందని వెల్లడించారు. ఈ సేవలు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా వాట్సప్‌ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు. సర్టిఫికెట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్టసవరణ చేస్తామని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

Share