చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంటకు చెందిన దినసరి కూలిపై పాములు పగబట్టాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. గత 30 ఏళ్లుగా ఇప్పటికే పదుల సార్లు పాము కాటుకి ఈ కూలీ బలయ్యాడు. కూలి పనులకు వెళ్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద... తను ఏ పనికి వెళ్లినా అక్కడ పాములు పగబట్టినట్లుగా కాటేస్తున్నాయి.20 ఏళ్ల వయసులో సుబ్రహ్మణ్యంను తొలిసారి పాము కరిచింది. వైద్యం చేయించుకుని బయటపడ్డారు. అప్పటి నుంచి ఏటా పలుమార్లు పాము కాటుకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. పాముల భయంతో పదేళ్ల కిందట బెంగళూరు వలస వెళ్లారు. అక్కడ భవన నిర్మాణ, మట్టి పనులు చేశారు. అక్కడా పాములు వదల్లేదు.స్వగ్రామానికి వచ్చి స్థానికంగా ఉన్న కోళ్ల పరిశ్రమలో పనికి కుదిరారు. అప్పుడప్పుడూ పొలం పనులకూ వెళ్తున్నారు. రెండు రోజుల కిందట ఊరి సమీపంలో పనులు చేస్తుండగా పాము కరిచింది. పాము కరిస్తే వైద్య ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని, నయమయ్యాక కూలి పనులు చేసి వాటిని తీర్చడం భారంగా మారిందని సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ వాపోయారు.
Share