Current Date: 25 Mar, 2025

తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ.. రెండు లక్షల కోళ్లను పూడ్చేసిన అధికారులు

తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది. గత నెలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోళ్లఫామ్ యాజమానులను, ప్రజలను అప్రమత్తం చేసింది. తద్వారా అధికారులు బర్డ్ ఫ్లూ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే, కొద్దిరోజులకే బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిపోవటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా.. మరోసారి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. వరుసగా లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నాయి. యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఓ కోళ్లఫామ్ లో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపడంతో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు రెండు రోజుల క్రితం సుమారు 40వేల కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేసి అనంతరం గొయ్యితీసి పూడ్చేశారు. ఫాంలోని దాదాపు 20వేల కోడిగుడ్లను, కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా గొయ్యిలో పూడ్చిపెట్టారు. కోళ్ల ఫామ్ లో ఉన్న దాణాను సీజ్ చేశారు.  అయితే, తాజాగా.. నల్గొండ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి.

Share