ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే పెర్త్‌లో విజయం సాధించిన టీమిండియా.. అడిలైడ్‌లోనూ అదే పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉంది. గులాబీ బంతితో జరిగే ఈ డే/ నైట్ టెస్టులో ఆధిపత్యం ఎవరిదో తేలనుంది. ఆస్ట్రేలియాతో చివరిగా ఆడిన డే/నైట్ టెస్టులో 36 పరుగులకు ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకున్న టీమిండియా ఈసారి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. ఆసీస్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులతో సమాయత్తమైంది. ఓపెనర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ కోసం త్యాగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌కి పరిమితం కానున్నాడు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే ఈ డే/నైట్ పోరు అభిమానులకు సరికొత్త అనుభూతి అందించనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్..అడిలైడ్‌లోనూ తమ ప్రతాపం చూపించేందుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. పెర్త్‌కు భిన్నంగా స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్న అడిలైడ్ పిచ్ ఎవరికి సహకరిస్తుందో చూడాలి.
Share