అమెరికన్ కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి గాయత్రీ మంత్రాన్ని పఠించారు. ఫ్రిడ్‌మాన్ గాయత్రీ మంత్రం జపించడంతో మోదీ ఆయనను మెచ్చుకున్నారు. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు ఈ ఇంటర్వ్యూ సాగింది. ఎపిసోడ్ చివరకు వస్తున్న సమయంలో ఫ్రిడ్‌మాన్ మాట్లాడుతూ, హిందూ ప్రార్థన లేదా ధ్యానంతో నాకు కొన్ని క్షణాలు మార్గనిర్దేశం చేస్తారా? అని అడిగారు. గాయత్రీ మంత్రాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు దీనిని జపించేందుకు ప్రయత్నించానని ఆయన తెలిపారు. ఈ మంత్రం విశిష్టత, జీవితంలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యత గురించి వివరించమని ప్రధానిని అడిగారు.ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని జపించేందుకు ప్రయత్నం చేస్తానని ప్రధానితో చెప్పి, మంత్రాన్ని పఠించారు. ఆ తర్వాత మంత్రాన్ని ఎలా పఠించాను, సరిగ్గానే చెప్పానా అని ప్రధానిని అడిగారు. ప్రధాని నరేంద్ర మోదీ బదులిస్తూ, చాలా గొప్పగా చెప్పారని, ఈ మంత్రం సూర్యుడి ప్రకాశవంతమైన శక్తికి అంకితమని, ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి శక్తిమంతమైన సాధనగా దీనిని పరిగణిస్తామని వివరించారు.
Share