ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యిందని సభ్యులు అన్నారని.. అది గత ప్రభుత్వంలో జరగిందని ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. మొదట దృష్టి పెట్టింది ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపైనే అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ఇప్పటికే 75 లక్షలు రికవరీ చేశామని.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 31 మందిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పనులు చేయకుండానే చేసినట్లు రాసుకున్నారన్నారు. జాతీయ ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Share