కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి తిరుమాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. దీపావళి ఆస్థానం కారణంగా 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
Share