భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి మరికొన్ని గంటల్లో వారి తిరుగుపయనం మొదలవ్వనుంది.2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు.సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైన సంగతి తెలిసిందే. ‘క్రూ-10 మిషన్’లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నారు. ఈ మేరకు నాసా ప్రకటించింది.
Share