Current Date: 12 Feb, 2026

ఏపీ బడ్జెట్ సమావేశాలు షురూ.. ఈరోజు అసెంబ్లీకి జగన్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇప్పటికే గవర్నర్‌ను కలిసి సభకు ఆహ్వానించగా, సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, విపక్ష వైకాపా కేవలం గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే సభకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే సమావేశాలకు ఆ పార్టీ సభ్యులు వస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీతో పాటు సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చించాలనేది ఖరారు చేస్తారు. అధికార కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం, సూపర్-6 పథకాల అమలు, విద్యా సంస్కరణలతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్తున్న తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ, పరకామణి చోరీ వంటి సుమారు 20 కీలక అంశాలపై సభలో చర్చకు సిద్ధమవుతోంది. మార్చి 12 వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. సభలో చర్చలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పని ఒత్తిడి తగ్గించేందుకు మార్చి 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేకంగా క్రీడా పోటీలను కూడా నిర్వహించనున్నారు. బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏయే కేటాయింపులు ఉండబోతున్నాయి, సంక్షేమ పథకాలకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారు అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.