Current Date: 10 May, 2026

ఈరోజు మధ్యాహ్నం నీడ కనిపించదు.. కావాలంటే చెక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఒక అరుదైన వింత చోటుచేసుకోనుంది. మధ్యాహ్నం సరిగ్గా 12:12 గంటలకు 'జీరో షాడో డే' ఏర్పడనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ సమయంలో సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదకు రావడం వల్ల వస్తువుల నీడలు కనిపించకుండా మాయమవుతాయి. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సూర్య కిరణాలు కర్కట, మకర రేఖల మధ్య నిలువుగా పడటం వల్ల ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. సూర్యుడు ఆకాశంలో సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు, వస్తువుల నీడలు నేరుగా వాటి కిందకే చేరిపోతాయి. దీనివల్ల కొద్దిసేపటి వరకు నీడ మనల్ని వెంటాడకుండా మాయమైనట్లు అనిపిస్తుంది. సాధారణంగా మనం ఎండలో నడుస్తున్నప్పుడు నీడ మన పక్కనో లేదా ముందు వెనకో కనిపిస్తుంటుంది. కానీ, ఈ ప్రత్యేక రోజున సూర్యరశ్మి నిలువుగా పడటం వల్ల నీడలు వస్తువుల అడుగు భాగానికి పరిమితమై అదృశ్యమవుతాయి. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి, విద్యార్థులకు ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా గమనించడానికి ఇది ఒక మంచి అవకాశం.