ఐటమ్ సాంగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి డిస్కో శాంతి 1996లో టాలీవుడ్ హీరో శ్రీహరిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలకు దూరమయ్యారు. అయితే, దురదృష్టవశాత్తూ 2013 అక్టోబర్ 9న కాలేయ సంబంధిత వ్యాధితో శ్రీహరి ముంబైలో కన్నుమూయడం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భర్త శ్రీహరి కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఆమె పంచుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రంలో కీలకమైన షేర్ ఖాన్ పాత్రను శ్రీహరి చేయవద్దని తాను మొదట సూచించానని ఆమె పేర్కొన్నారు. అప్పటికే హీరోగా పేరున్న వ్యక్తి క్యారెక్టర్ రోల్ చేయడం తనకు నచ్చలేదని, కానీ సినిమా చూసిన తర్వాత ఆ పాత్ర ప్రాముఖ్యత, రాజమౌళి విజన్ తనకు అర్థమైందని, ఆ పాత్ర లేకుండా ఆ సినిమానే లేదని ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించారు. షేర్ ఖాన్, సాల్మాన్ పాత్రలు పోషించిన శ్రీహరి.. తన డైలాగ్ డిక్షన్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆ మూవీలో రామ్ చరణ్ తర్వాత ఎక్కువ పేరు శ్రీహరికే వచ్చింది. ఇంకా చెప్పాలంటే శ్రీహరి కెరీర్.. మగధీరకు ముందు.. ఆ తర్వాత అనేలా పాపులారిటీని తీసుకొచ్చింది.