Current Date: 01 Sep, 2026

ఢిల్లీ నుంచి మంత్రి కొండా సురేఖకి పిలుపు.. వేటు తప్పదా?

తెలంగాణ మంత్రి కొండా సురేఖకి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల కొండా సురేఖ కూతురు సుష్మిత.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కానీ.. సురేఖ ఖండించకపోగా.. కూతురుకి మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ వ్యాఖ్యల పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేయడం, ఆ తర్వాత సంబంధిత నివేదికను అధిష్ఠానానికి పంపడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

ప్రమాదాన్ని గ్రహించిన కొండా సురేఖ ఆగమేఘాల మీద ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల్ని ఇటీవల కలిశారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. క్రమశిక్షణ కమిటీ సేకరించిన సమాచారం, గతంలో కొండా సురేఖ మంత్రుల అవినీతి, అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై వేటు ఖాయమనే కనిపిస్తోంది.

కొండా సురేఖతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా దిల్లీకి చేరుకోవడంతో రాజకీయ చర్చలు వేడెక్కాయి. మరి చూడాలి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే.. ఎవరికి ఆ పదవి దక్కుతుందో?

Share