రక్తహీనత (అనీమియా)పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐపీఎచ్ఏ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సోమవారం పెదవాల్తేరులోని కేడీపీఎం హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రీ మెడికల్ కాలేజీ, విశాఖపట్నం కమ్యూనిటీ మెడిసిన్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ డాక్టర్ ఎన్. ఉదయ్ కిరణ్ రక్తహీనతకు గల కారణాలు, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పేగుల్లో రక్తస్రావం, హుక్‌వార్మ్ (కొంకిపురుగు) సంక్రమణ, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల రక్తహీనత ఏర్పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. రక్తహీనతను నివారించేందుకు సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని డాక్టర్ ఉదయ్ కిరణ్ తెలిపారు. ముఖ్యంగా ఇనుము అధికంగా ఉండే రెడ్ మీట్, కాలేయం, నువ్వులు, ఆకుకూరలు వంటి పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి. మురళీమోహన్‌తో పాటు ఐపీఎచ్ఏ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకు రక్తహీనతపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
Share