Current Date: 25 Aug, 2026

విశాఖలో డేటా సెంటర్స్‌తో పర్యావరణ ముప్పు.. హెచ్‌ఆర్‌ఎఫ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేయ తలపెట్టిన హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యావరణ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని.. మంత్రి వాదనలు నిలబడట్లేదని స్పష్టం చేసింది. విశాఖ ప్రజలకు ప్రధాన తాగునీటి ఆధారమైన ముదసర్లోవా రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ఏరియాలోనే, రిజర్వాయర్‌కు కేవలం 120 మీటర్ల అత్యంత సమీప దూరంలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడం పర్యావరణ బాధ్యతారాహిత్యమని హెచ్‌ఆర్‌ఎఫ్ విమర్శించింది. 6.5 GW సామర్థ్యం కలిగిన ఈ డేటా సెంటర్ నిర్మాణం కోసం ప్రభుత్వం రోజుకో రకంగా నీటి వినియోగ గణాంకాలను మారుస్తోందని తెలిపింది. 1 TMC నుండి 3.5 TMC (సుమారు 99 బిలియన్ లీటర్లు), ఆపై 3 TMC అంటూ నీటి అవసరాలపై స్పష్టత లేకుండా మాట్లాడుతోందని ఆరోపించింది. ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి అయిన 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును ప్రభుత్వం విస్మరించిందని హెచ్‌ఆర్‌ఎఫ్ మండిపడింది. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు 17 ఏళ్లలో కేవలం 0.27% మాత్రమే పురోగతి సాధించిందని, ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి భారీగా నీటిని వినియోగించే డేటా సెంటర్లకు ప్రాధాన్యత ఇవ్వడం దారుణమని పేర్కొంది. ఈ హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు భారీ పెట్టుబడులతో కూడుకున్నవి అయినప్పటికీ, స్థానిక ప్రజలకు కల్పించే శాశ్వత ఉద్యోగాలు చాలా స్వల్పమని స్పష్టం చేసింది. 70% పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగిస్తామని చెప్తున్నప్పటికీ, ఇవి నిరంతరం 24/7 నడవడానికి అవసరమయ్యే భారీ విద్యుత్ భారం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. భూమి, నీరు, విద్యుత్ రాయితీలు, పన్ను మినహాయింపులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు దాటవేస్తోందని, ప్రజల ప్రశ్నలను 'అబద్ధాలు'గా కొట్టిపారేస్తూ పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందని హెచ్‌ఆర్‌ఎఫ్ విమర్శించింది.