Current Date: 25 Aug, 2026

ఆ ఐఏఎస్ అధికారి పారిపోలేదు బాబోయ్.. క్లారిటీ ఇచ్చిన కర్ణాటక మంత్రి

గత రెండు రోజులుగా అడ్రస్ లేకుండా పోయారని భావించిన కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ సురక్షితంగా ఉన్నారని, కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లారని రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖార్గే స్పష్టం చేశారు. ఆగస్టు 20 నుంచి ఆయన అధికారిక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, బెంగళూరు విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విమానం ఎక్కినట్లు తెలియడంతో ఆయన కనిపించడం లేదనే వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. అధికారి తండ్రి తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతుండటంతో ఆయన అత్యవసరంగా స్వగ్రామానికి వెళ్లాల్సి వచ్చిందని, ఇందుకోసం ఒక వారం రోజుల సెలవు కోరుతూ చేతిరాతతో రాసిన దరఖాస్తును కూడా ప్రభుత్వానికి అందజేశారని మంత్రి తెలిపారు. పండుగ సెలవుల కారణంగా ఆ దరఖాస్తు ప్రక్రియ వెంటనే పూర్తికాకపోవడం, ప్రయాణంలో ఉండటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఈ కంగారు ఏర్పడిందని ఆయన వివరించారు. తాను స్వయంగా ఐఏఎస్ అధికారి గంగ్వార్‌తో మాట్లాడినట్లు కూడా వెల్లడించారు. ఇటీవల కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాలకు, ఈ అధికారి లీవ్‌లో వెళ్లడానికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. గంగ్వార్‌పై ఎలాంటి ఆరోపణలు కానీ, విచారణలు కానీ లేవని మంత్రి తెలిపారు. ఎలాంటి ఏజెన్సీ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు సదరు అధికారి స్వయంగా స్పష్టం చేశారని, త్వరలోనే ఆయన తిరిగి వచ్చి విధుల్లో చేరతారని మంత్రి ప్రియాంక్ ఖార్గే పేర్కొన్నారు.