తెలంగాణలో అత్యంత వివాదాస్పద మంత్రిగా ఉన్న కొండా సురేఖకి మళ్లీ పదవి గండం మొదలైంది. తొలుత కేటీఆర్‌ని విమర్శించే క్రమంలో అక్కినేని ఫ్యామిలీ గురించి నోరుజారిన కొండా సురేఖ.. సమంతతో లింక్ పెడుతూ తీవ్ర విమర్శలుపాలైంది. ఈ వ్యవహారంలో నాగార్జున కోర్టుకెక్కగా.. ఆ తర్వాత క్షమాపణలతో ఆ సమస్యకి తెరపడింది. అనంతరం మంత్రుల కమీషన్ల గురించి బహిరంగ వేదికపై అడ్డదిడ్డంగా మాట్లాడేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికించేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సొంత పార్టీ నేతల నుంచే గట్టిగా డిమాండ్స్ వినిపించాయి. కానీ.. రేవంత్ రెడ్డి వెనకేసుకొచ్చారు. ఇప్పుడు కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు గుప్పించేసింది. దాంతో పరిస్థితి చేయి దాటిపోతోందని భయపడిపోయిన కొండా సురేఖ ఆగమేఘాల మీద బెంగళూరుకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతే తప్ప.. సుస్మిత చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. సుస్మిత వ్యాఖ్యలతో వివాదం రాజుకుంటోంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన నేపథ్యంలో సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కానీ ఈసారి మాత్రం పదవి ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.