Current Date: 25 Aug, 2026

తాళిబొట్టుపై నెటిజన్లు కెలికిన యాంకర్ అనసూయ.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్

నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ భర్త చనిపోయిన తర్వాత మహిళల పట్ల సమాజంలో అమలవుతున్న సాంప్రదాయ కట్టుబాట్లపై ప్రశ్నిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. భర్త మరణించిన తర్వాత స్త్రీలు బొట్టు, గాజులు, కాటుక, గజ్జెలు వంటి అలంకారాలను ఎందుకు తీసివేయాలంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. తమకు చిన్నప్పటి నుంచి బొట్టు, గాజులను పరిచయం చేసింది తల్లి లేదా అమ్మమ్మలని, భర్త కాదని అనసూయ గుర్తుచేశారు. అలాంటప్పుడు భర్త చనిపోగానే వాటిని తీసేయాలని ఎక్కడ రాసి ఉందో చెప్పాలని ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం తన తండ్రి మరణించిన నాటి నుంచి ఈ ఆలోచన తనను ఎంతగానో వేధిస్తోందని, తన తల్లి జీవితంలో వచ్చిన మార్పులను చూసి తీవ్రంగా మథనపడుతున్నానని ఆమె ఎమోషనల్ అయ్యారు. బొట్టు, గాజులు ధరించడం లేదా తీసివేయడం అనేది మహిళల పర్సనల్ ఛాయిస్‌గా ఉండాలని, బలవంతపు ఆచారంగా కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ సాంప్రదాయంపై అనసూయ లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అనసూయని తిట్టిపోస్తూ నెటిజన్లు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.