Current Date: 12 Feb, 2026

సోషల్ మీడియా పోస్టులకు అరెస్ట్‌లపై మార్గదర్శకాలు.. రూల్స్ పాటించాల్సిందే!

కర్ణాటక రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఎఫ్ఐఆర్‌ల నమోదు, అరెస్టుల విషయంలో పారదర్శకతను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజకీయ పరమైన విమర్శలు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు, పోలీసులు యాంత్రికంగా కేసులు నమోదు చేయకూడదని డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పులను అనుసరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులందరూ ఈ కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఏదైనా పోస్ట్‌పై ఫిర్యాదు అందినప్పుడు ప్రాథమిక విచారణ తప్పనిసరిగా చేపట్టాలి. ముఖ్యంగా రాజకీయ ప్రసంగాలు లేదా పోస్ట్‌లు కేవలం ఘాటుగా ఉన్నంత మాత్రాన కేసులు నమోదు చేయకూడదని, అవి ప్రజల్లో ద్వేషాన్ని పెంచేలా లేదా హింసను ప్రేరేపించేలా ఉంటేనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సెన్సిటివ్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుండి న్యాయపరమైన సలహా తీసుకోవాలని, ఒకవేళ ఫిర్యాదు రాజకీయ ప్రేరేపితమైనదిగా లేదా నిరాధారమైనదిగా తేలితే ఆ కేసును వెంటనే మూసివేయాలని పోలీసులను ఆదేశించింది. వ్యక్తిగత పరువు నష్టం కేసుల్లో నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం పోలీసులకు లేదని, అటువంటి సందర్భాల్లో ఫిర్యాదుదారులను సంబంధిత మేజిస్ట్రేట్‌ను సంప్రదించాలని సూచించాల్సి ఉంటుందని సర్క్యులర్ పేర్కొంది. అరెస్టుల విషయంలో కూడా అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన 'అర్నేష్ కుమార్' మార్గదర్శకాలను పాటించాలని, ఏకపక్ష అరెస్టులకు తావు ఉండకూడదని స్పష్టం చేసింది.