మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో దెబ్బతిన్న మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసాన్ని ఆయన సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. బుధవారం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిని సందర్శించిన జగన్, ఇప్పుడు విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జగన్ పర్యటనకు సంబంధించి విజయవాడ పోలీసులు రూట్ మ్యాప్‌పై ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించిన కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండు మార్గానికి బదులుగా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని విజయవాడ సీపీ రాజశేఖరబాబు నోటీసులు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ మార్పు చేసినట్లు పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైన తర్వాత చివరి నిమిషంలో నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని, పరామర్శలకు వెళ్తుంటే ఆంక్షలు పెడుతున్నారని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.