Current Date: 08 Feb, 2026

ఒక్కరోజులో 8,500 పెరిగిన బంగారం.. 2008 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత వారంలో ఔన్సు బంగారం ధర రికార్డు స్థాయిలో 5,594.82 డాలర్లకు, వెండి 115.50 డాలర్లకు చేరిన తర్వాత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌గా 'వార్ష్' నియామకంతో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయనే అంచనాలు, డాలర్ బలోపేతం కావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనివల్ల బంగారం 4,403 డాలర్లకు, వెండి 75 డాలర్లకు పడిపోయి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించాయి. అయితే, ఈ ఉపశమనం ఎంతో కాలం నిలవలేదు. అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణాన్ని తలపించడంతో, ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లారు. మంగళవారం రాత్రికి ఔన్సు బంగారం ధర ఏకంగా 292 డాలర్లు (6.3%) పెరిగి 4,926 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 83 డాలర్లకు ఎగబాకింది. 2008 తర్వాత ఒకే రోజులో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1,58,500 కు చేరగా, కిలో వెండి ధర రూ. 2,79,600 వద్ద స్థిరపడింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే బంగారంపై రూ. 8,500, వెండిపై రూ. 31,000 కు పైగా భారం పడింది. అస్థిరమైన రాజకీయ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.