Current Date: 08 Feb, 2026

రాజమండ్రిలో టైగర్ ఫియర్‌కు తెర.. 6 రోజులు పులి బీభత్సం!

తూర్పుగోదావరి జిల్లా ప్రజలను గత ఆరు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. రాయవరం మండలం కూర్మాపురం సమీపంలో ఈ పులిని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఆరు రోజుల్లోనే మూడు మండలాలు దాటేసిన ఈ పులి, దారిపొడవునా పశువులపై దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించింది. సాయంత్రం వేళల్లో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పులిని పట్టుకోవడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు వద్ద జనాల మధ్యే నడిరోడ్డుపై పులి కనిపించడంతో కలకలం రేగింది. దీనిని బంధించేందుకు పూణె నుండి ఐదుగురు నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని రప్పించారు. కూర్మాపురంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో పులి ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించారు. మొదట ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ మిస్-ఫైర్ అవ్వడంతో పులి పొలాల్లోకి పరుగులు తీసింది. అయినప్పటికీ అధికారులు పట్టు వదలకుండా వెంబడించి, కొత్త చెరువు వద్ద రెండోసారి మత్తు మందు ఇచ్చి విజయవంతంగా దాన్ని బంధించారు. పట్టుబడిన పులిని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వారం రోజులుగా జిల్లాలో కొనసాగుతున్న ‘టైగర్ ఫియర్’ కు తెరపడింది.