తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో జులై 3వ తేదీ నుంచి 5 వరకు అమెరికా మిషిగాన్ రాష్ట్రం, నోవీ నగరంలోని సబర్బన్ కలక్షన్ షోప్లేస్ వేదికగా 24వ తానా మహాసభలు నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు తానా ప్రతినిధులు ఆయన్ను అసెంబ్లీలో స్పీకర్ చాంబర్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ళ తదితరులు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సభ వివరాలను తెలియజేసి, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ప్రతిసారి దాదాపు 10,000 మందికిపైగా తెలుగు ప్రజలు ఈ మహాసభలకు హాజరవుతారని వారు తెలిపారు . ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరైతే మహాసభలకు మరింత మన్నన లభిస్తుందని, ఈ సందర్భంగా ఆయన్ను ఆహ్వానించడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నామని తానా ప్రతినిధులు తెలిపారు.
Share