Current Date: 08 Feb, 2026

అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం.. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లోకి టీమ్ ఇండియా

జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఫైసల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101*) సెంచరీలతో కదం తొక్కారు. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, మరో 53 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (115) అద్భుతమైన శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, వైభవ్ సూర్యవంశీ (68), కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో విహాన్ మల్హోత్రా (38*) బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యధిక సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్ కావడం విశేషం. ఈ విజయంతో భారత్ వరుసగా ఆరోసారి (మొత్తంగా పదోసారి) అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 6న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న తుది పోరులో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత కుర్రాళ్లు ఫైనల్లోనూ గెలిచి మరోసారి విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు