తమిళనాడులో ఓ పారిశుద్ధ్య కార్మికుడు తన నిజాయతీతో అందరి ప్రశంసలు అందుకున్నారు. తిరువారూర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న దురై అనే వ్యక్తికి, ఆదివారం ఉదయం విధుల్లో ఉండగా చెత్తలో ఒక బ్యాగు దొరికింది. దానిని తెరిచి చూడగా అందులో సుమారు 160 గ్రాముల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు ఉండటాన్ని గమనించి, ఏమాత్రం ఆశపడకుండా వెంటనే వాటిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల దర్యాప్తులో ఆ నగలు చెన్నైకి చెందిన రాధాకృష్ణన్ అనే వ్యక్తివిగా తేలింది. తన కుమార్తె వివాహం కోసం ఆయన కొంచెం కొంచెంగా కూడబెట్టిన ఈ నగలను, తిరువారూర్ జిల్లాలో జరిగిన ఒక శుభకార్యానికి వచ్చి పొరపాటున పోగొట్టుకున్నారు. దీనిపై వారు అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆందోళనలో ఉన్నారు. కార్మికుడు దురై అందించిన సమాచారంతో పోలీసులు రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. తాము పోగొట్టుకున్న నగలు తిరిగి దొరకడంతో రాధాకృష్ణన్ దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. కార్మికుడు దురై చేతుల మీదుగానే ఆ నగలను వారికి అందజేయగా, కూతురి పెళ్లి నగలు దొరికిన ఆనందంలో ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. నిరుపేద అయినప్పటికీ లక్షల విలువైన సొత్తును వెనక్కి ఇచ్చిన దురై నిజాయతీని పోలీసులు, స్థానికులు ఘనంగా సన్మానించి అభినందించారు.
Share