హీరోయిన్ హన్సిక మోత్వానీ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. భర్త సోహెల్ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తమ మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయని, చిన్న విషయాలే తగాదాలకు దారితీస్తుండటంతో కలిసి ఉండటం కష్టమని హన్సిక తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. హన్సిక, సోహెల్‌ల వివాహం 2022 డిసెంబర్‌లో జైపూర్ ప్యాలెస్ వేదికగా ఎంతో ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో, 2024 జూలై నుంచే విడివిడిగా జీవిస్తున్నారు. ముఖ్యంగా భర్త నుంచి ఎలాంటి భరణం ఆశించకుండానే హన్సిక విడాకులు కోరడం చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన హన్సిక, 'దేశముదురు' చిత్రంతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కంత్రి, కందిరీగ, పవర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి దక్షిణాదిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం వైవాహిక బంధం నుంచి విముక్తి పొందిన ఆమె, తిరిగి తన సినీ కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.
Share