Current Date: 29 Jun, 2026

దేశంలోనే బెగ్గర్-ఫ్రీ సిటీ‌గా ఇండోర్.. ఎలా సాధ్యమైందంటే?

దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా వరుసగా గుర్తింపు పొందుతున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఇప్పుడు మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. యాచకులు లేని దేశపు తొలి నగరంగా (బెగ్గర్-ఫ్రీ సిటీ) రికార్డు సృష్టించింది. కేవలం భిక్షాటనను నిషేధించడమే కాకుండా, యాచకులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి, వారు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేసిన ప్రయత్నాలు ఇక్కడ విజయవంతమయ్యాయి. ఈ మార్పు కోసం ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక యంత్రాంగం రెండేళ్ల క్రితమే రోడ్లు, ప్రధాన కూడళ్ల వద్ద భిక్షాటన చేయడాన్ని పూర్తిగా నిషేధించాయి. నగరంలో ఎక్కడైనా యాచకులు కనిపిస్తే, మహిళా- శిశు అభివృద్ధి శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలిస్తాయి. అక్కడ వారికి తగిన ఆశ్రయం కల్పించడంతో పాటు తదుపరి సహాయక చర్యలు చేపడతారు. పునరావాస కేంద్రానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులను గుర్తించడం, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం వంటివి చేస్తారు. అంతేకాకుండా, వారి నైపుణ్యాలను బట్టి ఉపాధి మార్గాలను చూపిస్తారు. యాచకుల పిల్లలను గుర్తించి, వారికి ఆధార్ కార్డులు సహా ఇతర అవసరమైన పత్రాలను సిద్ధం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు ఇండోర్ యంత్రాంగం బలమైన పునాది వేస్తోంది.