Current Date: 18 Jun, 2026

అఫ్గాన్‌ను రెండో వన్డేలో భారత్ చిత్తు.. గిల్, ఇషాన్ శతకాల మోత

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది. రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154) భీకర శతకంతో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (48) రాణించినప్పటికీ, యశస్వి (4) నిరాశపరిచాడు. ఒక దశలో 450 పరుగులు చేసేలా కనిపించిన భారత్, గిల్ అవుటయ్యాక రషీద్ ఖాన్, ఖరోటే బౌలింగ్ ధాటికి చివరి 7 వికెట్లను కేవలం 42 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. అనంతరం 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌ను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అర్ష్‌దీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు తీయడంతో అఫ్గాన్‌కి ఓటమి తప్పలేదు. ఆ జట్టు బ్యాటర్లలో రహ్మత్ షా (79) ఒంటరి పోరాటం చేసినా గెలిపించలేకపోయాడు. రసూలి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల వద్దే అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో టీమ్‌ఇండియా 170 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను అలవోకగా చేజిక్కించుకుంది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్టును కూడా భారత్ మూడు రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక లాస్ట్ వన్డే శనివారం చెన్నైలో జరగనుంది.