భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు 'ఎక్స్' (X) కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన నేపథ్యంలో, కేంద్రం ఈ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యకలాపాలు ఊపందుకుంటున్న వేళ, ఆయనకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో ఈ రక్షణ కల్పించనున్నారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన లియాండర్ పేస్, గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో పనిచేశారు. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన గత వారం ఢిల్లీలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం భాజపా ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. కోల్‌కతాలో పుట్టి పెరిగిన పేస్, యువతను ఆకర్షించడంలో పార్టీకి కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో ఆయన విస్తృతంగా పాల్గొనాల్సి ఉన్నందున ఈ భద్రతను కేటాయించారు. టెన్నిస్ కోర్టులో 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, ఒలింపిక్ మెడల్‌తో దేశానికి గర్వకారణంగా నిలిచిన లియాండర్ పేస్, ఇప్పుడు రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో బెంగాల్‌లో జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు ఆయన సిద్ధమవుతున్నారు. మే 4న వెలువడనున్న ఫలితాలు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. క్రీడాకారుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఆయన, రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి.