Current Date: 18 Mar, 2026

రాజకీయాల్లో ఉన్నా.. సినిమా మాత్రం నా నరనరాల్లో: పవన్ కళ్యాణ్

పవన్‌ కల్యాణ్ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్ర పీ-రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నా సినిమా తన నరనరాల్లో ఉండిపోయిందని, సరైన ప్రణాళిక ఉంటే ప్రజా సేవకు ఆటంకం కలగకుండా సినిమాలు కొనసాగించవచ్చనే ధైర్యం ఈ చిత్రంతో కలిగిందని పేర్కొన్నారు. తనపై వచ్చే విమర్శలను ప్రస్తావిస్తూ, ఇతరులకు వ్యాపారాలు ఉన్నట్లే తనకు సినిమా ఉందని, రోజుకు 16 గంటలు కష్టపడుతూ సమయాన్ని సర్దుబాటు చేసుకుని ఈ చిత్రాన్ని కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేశానని వివరించారు. సినిమా రంగాన్ని, ప్రేక్షకులను విడదీయలేమని, వినోదం మన దేశ ఆత్మ అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం నిర్మాతలకు మేలు చేయడమే కాకుండా, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తుందని, బ్లాక్ మార్కెట్‌ను అరికడుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర భాషా చిత్రాల పట్ల వివక్ష చూపకూడదని, భారతీయ సినిమా ఎక్కడైనా ఆడాలని కోరుకుంటూ ‘కాంతార 2’ వంటి చిత్రాలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఉదాహరణగా చెప్పారు. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌తో సినిమా చేయడం తన అదృష్టమని, ఈసారి ఉగాది ‘ఉస్తాద్‌ ఉగాది’గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించగా, ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వేడుక చివరిలో అభిమానుల కోరిక మేరకు "నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం" అంటూ పవన్‌ చెప్పిన మాటలు  విశేషంగా ఆకట్టుకున్నాయి.