Current Date: 28 Mar, 2026

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుకు డెడ్‌లైన్.. ఏం చేస్తారో?

మార్చి నెలాఖరులోగా నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో 'క్రాస్ బోర్డర్ ఆపరేషన్' ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా, మావోయిస్టు అగ్రనేత రామన్న అలియాస్ గణపతి అలియాస్ లక్ష్మణరావు ఈ నెల 31లోగా లొంగిపోయే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ పోలీసులతో గణపతి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు, ఝార్ఖండ్‌లో ఉన్నట్లు భావిస్తున్న మిసిర్ బిస్రా అలియాస్ భాస్కర్ కోసం కోబ్రా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్లలో భాగంగా భారీగా ఎన్‌కౌంటర్లు లేదా లొంగుబాట్లు జరిగే అవకాశం ఉందని సీఏపీఎఫ్ కమాండర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బస్తర్ అడవుల నుంచి ఝార్ఖండ్‌లోని సారందా అడవుల వరకు సుమారు 130 నుండి 150 మంది సాయుధ మావోయిస్టుల కోసం సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ బృందాలు గాలిస్తున్నాయి. ఇందులో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు డివిజనల్ స్థాయి నాయకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆఖరి పోరాటంతో దేశంలో సాయుధ నక్సలిజానికి ముగింపు పలకాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మారిన రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక చర్యల నేపథ్యంలో, మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి ఈ 2-3 రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.