రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం రంగారెడ్డిగూడలో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నిర్జన ప్రాంతంలో తన తల్లి రక్తపు మడుగులో పడి ఉండగా, ఏమీ తెలియని రెండున్నరేళ్ల చిన్నారి రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే ఏడుస్తూ గడిపింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు చిన్నారి రోదనలు విని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డిగూడకు చెందిన శోభ భర్తతో విడిపోయి, నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరికి మమత అనే రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. అయితే నర్సింహులుతో కూడా గొడవలు రావడంతో ఆమె పుట్టింటి వద్దే ఉంటోంది. కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని నర్సింహులు ఆమెను షాద్‌నగర్‌కు రమ్మన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య తెల్లవారుజామున రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో శోభ శవమై కనిపించింది. ఎవరో ఆమె తలపై బండరాయితో మోది కిరాతకంగా చంపేశారు. తల్లి మరణించిన విషయం కూడా తెలియక ఆ చిన్నారి రాత్రంతా చీకట్లో శవం పక్కనే బిక్కుబిక్కుమంటూ గడపడం స్థానికులను కలచివేసింది.
Share