ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. మే నెల రాకముందే చాలా జిల్లాల్లో టెంపరేచర్స్ 45 డిగ్రీలకు చేరాయి. దీంతో జనం వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ప్రత్యేకించి పిల్లలు, ముసలివారు చాలా ఇబ్బందిపడుతున్నారు. వాతావరణం హాట్‌గా ఉండటంతో.. మధ్యాహ్నం టైంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 19 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇంకొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతల 44 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, లేవిడి, ప్రకాశం జిల్లా తోకపల్లి, వైఎస్‌ఆర్ కడప జిల్లా బలపనూరు ప్రాంతాల్లో 44.9 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి.
తూర్పుగోదావరి, విశాఖల్లోని ఒక్కో మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ పేర్కొంది.