Current Date: 25 Nov, 2024

నడిరోడ్డుపై గిరిజన మహిళ ప్రసవ వేదన!

ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్లు లేకపోవడంతో సరైన సమయంలో వైద్యం అందక చాలా మంది రోజూ ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం కోసం కిలో మీట‌ర్లు కాలిన‌డ‌క‌నే ప్ర‌యాణం సాగిస్తున్న ప‌రిస్థితులు దశాబ్దాలుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని  గిరిజన గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఇక గర్భిణిల సంగతైతే చెప్పనక్కరే లేదు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణిలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నార‌ని ప్రభుత్వ పెద్దలకి తెలియజేసేలా తాజాగా మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

గూడెం నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేక‌పోవ‌డంతో గర్భిణి కాలిన‌డ‌క‌న ఆసుపత్రికి వెళ్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్త్రావం అయినప్పటికీ.. అతి కష్టంగా మూడు కిలో మీట‌ర్లు కాలిన‌డ‌క వెళ్లి రోడ్డు మార్గానికి చేరుకోవాల్సి వచ్చింది. అంబులెన్స్ సదుపాయం కూడా లేకపోవడంతో ఆ నిండు చూలాలు గంటల పాటు నరకం అనుభవించింది. గిరిజనుల ప్రాంతంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి.