Current Date: 17 Feb, 2026

భారత్-పాక్ మ్యాచ్.. రిజల్ట్‌కి ముందే నఖ్వీ జంప్!

టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. కొలంబో వేదికగా జరిగిన హైవోల్టేజ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమ్ ఇండియా 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ బోర్డు చేసిన 'బాయ్‌కాట్' డ్రామాలు మైదానంలో పసలేకుండా పోయాయి. టీమ్ ఇండియా ప్లేయర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు వరుసగా వికెట్లు పారేసుకోవడంతో, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి నిష్క్రమించడం చర్చనీయాంశమైంది. తమ జట్టు గెలిస్తే హడావుడి చేద్దామనుకున్న నఖ్వీ, ఘోర పరాజయం ఖాయమని తేలడంతో తట్టబుట్ట సర్దుకుని వెనుదిరిగారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ ఓటమిపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చేతిలో ఓడిపోవడం తమ జట్టుకు అలవాటుగా మారిందని, కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడం సిగ్గుచేటని వారు వాపోతున్నారు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం తమ వల్ల కాదని, టీమ్ ఇండియా అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిందని పాక్ అభిమానులు అంగీకరిస్తున్నారు. ఈ విజయంతో భారత్ అధికారికంగా సూపర్-8 దశకు చేరుకోగా, పాక్ భవితవ్యం ఇప్పుడు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంది.