Current Date: 26 Nov, 2024

హిందూపూర్ లో "అఖండ" విజయం ఖాయమా??

నందమూరి అందగాడు బాలకృష్ణ సినీ రంగాన లెజెండ్ గా రాణిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాని పుణికిపుచ్చుకుని సినీ రంగాన సూపర్ స్టార్ గా నిలిచారు. ఇక రాజకీయ రంగంలో సైతం బాలయ్య ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నారు.ఆయన 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రి ఎన్టీఆర్ మూడు సార్లు అన్న హరికృష్ణ ఒకసారి గెలిచిన హిందూపూర్ సీటు నుంచి బాలయ్య పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక 2019లో జగన్ వేవ్ బలంగా వీచిన టైం లో సైతం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి టీడీపీ గెలిచిన రెండు సీట్లలో బాలయ్యది ఒక్కటి కావడం విశేషం.  ఈసారి ఎన్నికలతో హ్యాట్రిక్ విజేతగా నిలవాలని బాలయ్య బరిలోకి దిగారు. పోలింగ్ పూర్తి అయింది. హిందూపురంలో బాలక్రిష్ణ పరిస్థితి ఏమిటి అన్నది చూస్తే కనుక గ్రౌండ్ లెవెల్ లో వస్తున్న సమాచారం ప్రకారం బాలక్రిష్ణ మరోసారి విజయఢంకా మోగిస్తారు అని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచే సీట్లలో హిందూపురం పేరు మొదటి వరసలో ఉందని అంటున్నారు. ఈసారి ఆయన మెజారిటీ కూడా పెరగవచ్చు అని అంటున్నారు. 2019లో పదహారు వేల పై చిలుకు మెజారిటీ సాధించిన బాలయ్య ఈసారి దానిని మరింతగా పెంచుకున్నారు. వైసీపీలో వర్గ పోరే బాలయ్య విజయానికి శ్రీరామ రక్షగా ఉందని అంటున్నారు. ఈసారి ఇండిపెండెంట్ గా స్వామీజీ పరిపూర్ణానంద పోటీ చేసారు. ఆయన ప్రభావం ఎంత ఉందన్నది తెలియదు కానీ బాలయ్య విజయం మాత్రం పక్కా అని అంటున్నారు. హిందూపురం టీడీపీకి బలమైన సీటు. టీడీపీ పుట్టాక ఇప్పటిదాకా అక్కడ వేరే పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. 1983 నుంచి చూస్తే ఇది పదవ సారి జరుగుతున్న ఎన్నిక. ఇందులో మూడు సార్లు ఎన్టీఆర్ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే రెండు సార్లు బాలయ్య, ఒకసారి హరిక్రిష్ణ గెలిచారు. ఈసారి కూడా బాలయ్య గెలుస్తారు అని అంటున్న నేపధ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం ఏడు సార్లు గెలిచినట్లుగా అవుతుంది . అయితే హిందూపురంలో పరిస్థితులు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండడమే బాలయ్య విజయానికి అవకాశాలు పెంచుతున్నాయని అంటున్నారు. ఆ ధీమాతోనే బాలయ్య తన సొంత సీటులో నామినేషన్ వేసిన తరువాత రాష్ట్రమంతా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు గెలుపు ధీమాతో పాటు మంచి మెజారిటీ వస్తుందని నమ్మకం ఉందని అంటున్నారు. మరో వైపు బాలయ్య కుమార్తెలతో పాటు ఆయన సతీమణి కూడా హిందూపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. మొత్తానికి బాలయ్య ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని అంటున్నారు.