Current Date: 05 Oct, 2024

వైద్యం కోసం డోలీలో ఆరు కిలోమీటర్లు మోసిన పిల్లలు ..

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ డోలీ మోతలు తప్పడం లేదు. స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు దాటుతున్నా గిరిజనలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కిలోమీటర్ల మేర రోగిని తరలించేందుకు ఆదివాసీలు నానా పాట్లు పడుతున్నారనేందుకు ఈ సంఘటనే ఉదాహారణ. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయితీ జాజులు బంధ జనం ఓ మహిళ విషయంలో నరకం చూశారు. గ్రామానికి చెందిన మర్రి కావ్య (21) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. బుధవారం తెల్లవారుజామున ఆమెకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. సమీపంలోని ఆస్పత్రికి తరలించేందుకు కనీసం ఆరు కిలోమీటర్లయినా నడవాల్సిందే.అంబులెన్స్‌కు సమాచారమిస్తే రాలేదు. రోగికి సంబంధించి సమీప ఆస్పత్రి వైద్యుడికి ఇటీవల ఫోన్‌ చేస్తే ఆయనా స్పందించలేదని గిరిజనం వాపోయారు.దీంతో గత్యంతరం లేక డోలీ మోతలోనే ఆరు కిలోమీటర్లు కావ్యను తరలించాల్సి వచ్చిందని  పీవీటీజీ ఆదివాసీ గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు