తెలంగాణలో మాజీ భార్యను అత్యంత కిరాతకంగా భర్త చంపిన ఘటన సంచలనంగా మారింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన దేవరకొండ మహేశ్, మహారాష్ట్రకు చెందిన సునీత 2022లో వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన వీరిద్దరూ కెనడా వెళ్లిన కొద్దిరోజులకే మనస్పర్థలు రావడంతో 2024లో విడాకులు తీసుకున్నారు. అయితే, సునీత పెట్టిన గృహహింస కేసు కారణంగా మహేశ్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. తల్లి మరణం తర్వాత ఇండియాకు వచ్చిన మహేశ్ పాస్‌పోర్ట్‌ను పోలీసులు సీజ్ చేయడంతో అతను తిరిగి కెనడా వెళ్లలేకపోయాడు. తన కెరీర్ నాశనం కావడానికి, తల్లి మరణానికి సునీతే కారణమని భావించిన మహేశ్, ఆమెపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. విడాకుల తర్వాత సునీత హైదరాబాద్ వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ శ్రీనాథ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పెట్టిన ఒక గుడి ఫొటో ఆధారంగా అది వనస్థలిపురంలోని ఆలయమని మహేశ్ గుర్తించాడు. నగరానికి చేరుకుని నెల రోజులుగా హాస్టల్‌లో ఉంటూ, ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై రెక్కీ నిర్వహించాడు. సునీత గర్భిణి అని తెలిసి కూడా, ఆమె రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక అంతమొందించాలని పక్కా ప్లాన్ వేశాడు. సునీత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి చొరబడిన మహేశ్, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. నిందితుడి సంచిలో కత్తులతో పాటు తలుపులు కోసేందుకు విద్యుత్ రంపాలు, అడ్డువచ్చిన వారిని బెదిరించేందుకు పెట్రోల్ డబ్బా కూడా ఉన్నాయి. హత్య తర్వాత లోపలి నుంచి గడియ పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించిన మహేశ్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
Share