Current Date: 04 Apr, 2026

జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దాడి.. గొడవ ఏంటంటే?

జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాల గ్రామంలో రాత్రి ఎనిమిది మంది వ్యక్తులు దాడికి తెగబడ్డారు. కొమురక్క ఇంట్లో గతంలో జరిగిన బంగారం చోరీ విషయమై ఆమె అసిస్టెంట్ శ్రీనాథ్‌ను నిలదీయడమే ఈ గొడవకు కారణమైంది. శ్రీనాథ్ తన నేరాన్ని అంగీకరించి బంగారం తిరిగి ఇస్తానని చెప్పినప్పటికీ, కాలయాపన చేయడంతో రెండు రోజుల క్రితం ఆమె అతడిని మందలించారు. దీంతో కక్ష పెంచుకున్న శ్రీనాథ్, తన స్నేహితులకు విషయం చెప్పి ఈ దాడికి పురికొల్పాడు. రాత్రి 11 గంటల సమయంలో నిందితులు వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్ సహా ఎనిమిది మంది కొమురక్క ఇంటికి చేరుకున్నారు. తాము అభిమానులమని, ఫొటోలు దిగడానికి వచ్చామని నమ్మించి లోపలికి ప్రవేశించారు. అనంతరం శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావంటూ గొడవకు దిగి, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన కొమురక్క సోదరుడు యాదయ్యపై రాళ్లతో దాడి చేయగా, చంద్రశేఖర్ అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో కొమురక్క కుడి చేతికి గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు బాధితులను చంపేస్తామని బెదిరించి, స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా తమ ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.