Current Date: 09 Jun, 2026

చిక్కుల్లో రామ్‌చరణ్ 'పెద్ది' మూవీ.. ఆదివాసీలు ఫిర్యాదు

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ చిత్రానికి వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణ మహిళలతో పాటు తోటి సినిమా హీరోయిన్లు సైతం ఆ సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ, సదరు సీన్లలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాలో గిరిజనులను కించపరిచేలా పలు సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయంటూ ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి వారు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సినిమా మొత్తంలో దాదాపు 15 సార్లు గిరిజన సమాజాన్ని అవమానించేలా పదాలు వాడారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరిజన హక్కుల చట్టంలో స్పష్టం చేసిన పదాలనే సినిమాలో అసభ్యంగా వాడడం, వాటిని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఇష్టానుసారంగా ఉపయోగించడంపై ఆదివాసీలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో పాటు సెన్సార్ అధికారులపై కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్ల వసూళ్లు సాధించి ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది.