పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్ అత్యంత తీవ్రంగా బదులిచ్చింది. ఇరాన్ వైమానిక పరిధిలోకి దూసుకెళ్లిన ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) అక్కడ భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించి ప్రతికారం తీర్చుకుంది. ఈ దాడులకు సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని ఇరానియన్ ఉగ్రవాద పాలనకు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దళం కొద్దిసేపటి క్రితమే ఈ సైనిక స్థావరాలపై విజయవంతంగా దాడులను పూర్తి చేసిందని IDF తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదిరింది.