Current Date: 12 Jun, 2026

ప్రియుడి కోసం బిడ్డను చంపిన లాయర్ తల్లి.. బతుకు చీకటిమయం!

ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉందని తన ఐదేళ్ల కుమార్తె వెన్నెలను హత్య చేసిన తల్లి ప్రియాంకను పోలీసులు హాసనలో అరెస్టు చేశారు. కర్ణాటకలో దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రియాంకకు.. చిన్ననాటి స్నేహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారినని చెప్పుకున్న మోహన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో, భర్త హెచ్చరించినా వినకుండా ఆమె కుమార్తెను తీసుకుని ప్రియుడితో సహజీవనం ప్రారంభించి, భర్తకు విడాకుల నోటీసులు పంపింది. ఈ క్రమంలో పాప అనారోగ్యంతో మరణించిందని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసిన ప్రియాంక, భర్తకు పోస్ట్‌మార్టం నివేదిక పంపింది. అయితే, విదేశాల్లో ఉన్న వైద్య స్నేహితుని సాయంతో ఆ నివేదికపై అనుమానం వచ్చిన భర్త ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా, ప్రియుడితో మరింత సన్నిహితంగా ఉండేందుకే పాపను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. తాను కోటీశ్వరుడినని మోహన్ చెప్పిన మాయమాటలు నమ్మి ప్రియాంక తప్పుదారి పట్టింది. తీరా బాగా దగ్గరయ్యాక అతను కోటీశ్వరుడు కాదని, కేవలం అద్దె ఇళ్ల బ్రోకర్ అని తెలిసింది.