Current Date: 12 Jun, 2026

బాక్సాఫీస్‌ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం.. వారం రోజుల్లోనే రూ.345 కోట్లు!

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది. శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రానికి మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దాంతో ఈ సినిమా ఓపెనింగ్ రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది. కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో సినిమాకు వస్తున్న క్రేజ్, నిలకడైన వసూళ్లను చూస్తుంటే.. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం చాలా సులభంగా రూ.400 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.