Current Date: 04 Apr, 2026

టీవీకే అధినేత విజయ్ ఆస్తులు రూ.600 కోట్లు.. అప్పులు జీరో!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన టీవీకే అధినేత, కోలీవుడ్ స్టార్ విజయ్ తన నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ఆయన, తన స్థిర, చరాస్తుల మొత్తం విలువను సుమారు రూ. 600 కోట్లుగా ప్రకటించారు. ఇందులో విశేషమేమిటంటే, అంతటి భారీ ఆస్తులు ఉన్నప్పటికీ తన పేరు మీద ఒక్క రూపాయి కూడా అప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. విజయ్ వద్ద వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ.388 కోట్లు ఉన్నాయి. ఆయన వద్ద బీఎండబ్ల్యూ ఐ7, టయోటా వెల్ఫేర్ వంటి సుమారు రూ. 14.35 కోట్ల విలువైన లగ్జరీ కార్లతో పాటు, సామాన్యులు వాడే మారుతి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ వంటి వాహనాలు కూడా ఉండటం గమనార్హం. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం ఉండగా, భార్య సంగీత పేరిట రూ. 4.07 కోట్ల విలువైన బంగారం, కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, విజయ్ తన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు భారీగా అప్పులు ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. తన భార్య సంగీతకు రూ. 12.60 కోట్లు, తండ్రి చంద్రశేఖర్‌కు రూ. 3.02 కోట్లు, తన పార్టీ కీలక నేత ఎన్. ఆనంద్‌కు రూ. 3 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఈ ఎన్నికల్లో విజయ్ రాజకీయ అరంగేట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.