Current Date: 04 Apr, 2026

ఐపీఎల్‌లో ఢిల్లీని గెలిపించిన ఇంపాక్ట్ ప్లేయర్.. కొత్త ట్రెండ్ షురూ!

ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ జట్టు, దిల్లీ బౌలర్లు లుంగి ఎంగిడి, నటరాజన్ ధాటికి వణికిపోయి 18.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్ (36) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో లఖ్‌నవూ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీకి ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. మహమ్మద్ షమీ, మోసిన్ ఖాన్ ధాటికి కె.ఎల్ రాహుల్ (0), నితీశ్ రాణా (15) వంటి కీలక ఆటగాళ్లు వెనుదిరగడంతో దిల్లీ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో ఓటమి ఖాయమనిపించినా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమీర్ రిజ్వి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. సమీర్ రిజ్వి 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 70 పరుగులు చేశాడు. అతడికి ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 119 పరుగులు జోడించి, మరో 17 బంతులు మిగిలి ఉండగానే దిల్లీని విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఛేదనకు దిగిన జట్లనే విజయం వరించడం విశేషం