Current Date: 04 Apr, 2026

రోజు వ్యవధిలో మారిన ట్రంప్ స్వరం.. బాంబుల వర్షం‌ వార్నింగ్

పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గందరగోళ ప్రకటనలు చేశారు. తొలుత ఇరాన్‌పై దాడులను మరో 2-3 వారాల్లో ముగించే అవకాశం ఉందని, హర్మూజ్ జలసంధి బాధ్యత తమది కాదని ఓవల్ కార్యాలయంలో చెప్పారు. అయితే, మరుసటి రోజే స్వరం మార్చి, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకుంటే బాంబుల వర్షంతో ఇరాన్‌ను "రాతియుగం" నాటి దశకు తీసుకెళ్తామని హెచ్చరించారు. అక్కడ స్వేచ్ఛాయుత రవాణా నెలకొనే వరకు దాడులు ఆపే ప్రసక్తి లేదని 'ట్రూత్ సోషల్' వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్‌పై ఇజ్రాయెల్ తన భీకర వైమానిక దాడులను  కూడా కొనసాగించింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్, పర్షియన్ గల్ఫ్‌లోని పొరుగు దేశాలపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో యూఏఈపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు గాయపడినట్లు సమాచారం. ఇరాన్ కొత్త నాయకత్వం ఒప్పందానికి వస్తుందని ఆశిస్తున్నట్లు చెబుతూనే, అగ్రరాజ్యం తన అదనపు బలగాలను, విమానవాహక నౌకలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఇరాన్‌తో యుద్ధంలో మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాటోను "కాగితపు పులి"గా అభివర్ణించిన ఆయన, అమెరికా ఆ కూటమి నుంచి వైదొలిగే దిశగా ఆలోచిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ నౌకాదళ సామర్థ్యాన్ని కూడా ఎద్దేవా చేస్తూ, యుద్ధం ముగిస్తేనే అమెరికాలో ఇంధన ధరలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.