ఇప్పటివరకు ఏటీఎంలలో కార్డు లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకోవడాన్ని ఉచితంగా భావించేవారు. కానీ, ఏప్రిల్ 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రధాన బ్యాంకులు వీటిని కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిలోనే చేర్చనున్నాయి. ఒకసారి ఉచిత పరిమితి ముగిసిన తర్వాత, యూపీఐ ద్వారా చేసే ప్రతి విత్‌డ్రాయల్‌పై రూ. 23తో పాటు అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని భారీగా తగ్గించింది. గతంలో రూ. 1,00,000 వరకు ఉన్న పరిమితిని ఇప్పుడు రూ. 50,000కు కుదించింది. అలాగే, బంధన్ బ్యాంక్ ఖాతాదారులు తమ సొంత ఏటీఎంలో నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో (మెట్రో నగరాల్లో) కేవలం 3 సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ. 10 వసూలు చేస్తారు. ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ డిజిటల్ చెల్లింపులకు 'రెండంచెల భద్రత'ను తప్పనిసరి చేస్తోంది. దీనివల్ల ఇకపై ఓటీపీతో పాటు పిన్ లేదా బయోమెట్రిక్ ధ్రువీకరణ అవసరమవుతుంది. వీటితో పాటు, బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా పదేపదే బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు ఉన్నవారికి కూడా షాక్ తగలనుంది. పరిమితికి మించి బ్యాలెన్స్ తనిఖీ చేస్తే నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.