సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందనతో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. హైడ్రా పేరుతో వందలాది ఇళ్ల నిర్మాణాలను రేవంత్ సర్కార్ కూల్చేసింది. దాంతో జనం తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా వారి గోడు వినాలనుకోవడం సాహసమే. నవంబర్ 08వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా.. తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ, జిల్లా అధికారులతో కలిసి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. అనంతరం.. "మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర" పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రను వాడపల్లి నుంచి ప్రారంభించనున్నారు.
Share