Current Date: 20 Jun, 2026

పాము చిన్నగా ఉందని ఆటలు.. బిజినెస్ మ్యాన్ మృతి

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. కానీ.. పాము చిన్నగా ఉందని దాంతో ఫాంహౌస్‌లో ఆట ఆడిన బిజినెస్ మ్యాన్ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్‌కు చెందిన నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ హుస్సైనీకి మొయినాబాద్‌లో ఫాంహౌస్ ఉంది. ఈ నెల 17న రాత్రి ఆయన తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫాంహౌస్‌లోకి ఒక చిన్న కట్లపాము వచ్చింది. దాంతో మొహిద్దీన్ ఆ పామును చేతితో పట్టుకుని, అక్కడున్న స్నేహితులను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పాము ఆయన కుడిచేతి బొటనవేలును గట్టిగా కరిచింది. పాము కరుస్తోందని చెబుతూనే ఆయన దాన్ని రెండో చేతితో వదిలించుకున్నారు. పక్కన ఉన్న స్నేహితులు కంగారుపడుతున్నా, తనకు ఏమీ కాదంటూ మొహిద్దీన్ వారిని వారించారు. కానీ.. పాము కాటు వేసిన గంట తర్వాత శరీరంలో మార్పులు రావడంతో వెంటనే ఆయనను మెహిదీపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఇంజక్షన్ ఇచ్చినప్పటికీ, రెండు గంటల్లో పరిస్థితి మరింత విషమించింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మొహిద్దీన్ మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.